కలకలం రేపుతున్న మరో ఘటన…కనకదుర్గమ్మ ఆలయంలో..

వాస్తవం ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధం కావడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, నిరసనలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే ఆలయాల విషయంలో మరో ఘటన చోటు చేసుకుంది.

విజయవాడ కనకదుర్గమ్మ వెండి రథంలోని నాలుగు సింహాల్లో ఏకంగా మూడు సింహాలు మాయమవడం కలకలం రేపుతోంది. దుర్గమ్మకు మూడు రథాలున్నాయి. వాటిలో ఈ వెండి రథం ఒకటి. శ్రీదుర్గామల్లేశ్వరులను ప్రతి ఉగాదికి ఈ రథంపైనే ఊరేగిస్తారు.

అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించలేదు. గతేడాది ఉగాదికి ఆది దంపతుల ఊరేగింపు పూర్తైన అనంతరం వెండి రథాన్ని మహామండపం ముందు నిలిపి.. టార్పాలిన్ కప్పేశారు.

ఇటీవల అంతర్వేది ఘటన అనంతరం దుర్గ గుడిలోని రథాల భద్రత గురించి విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు సోమవారం దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబుతో చర్చించారు. పలు సూచనలు చేసిన అనంతరం వెండి రథాన్ని పరిశీలించేందుకు టార్పాలిన్ కవర్‌ తీయగా.. మూడు సింహాలు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది.  ఆలయ అధికారులు మాత్రం దీనిపై గోప్యత పాటిస్తున్నారు. వెండి రథంపై సింహాలు చోరీకి గురైందీ లేనిది తేలడానికి మూడు రోజులు పడుతుందని ఈవో సురేష్‌బాబు మీడియాకు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.