విపక్ష నేతలపై విమర్శనాస్త్రాలు సంధించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు

వాస్తవం ప్రతినిధి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విపక్ష నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మీడియా లో కధనాలు ప్రసారం చేయకుండా విపక్ష నేతలు అడ్డుకుంటున్నారని, ప్రతిపక్షమే మీడియా స్వేచ్ఛను హరించడం విడ్డూరంగా ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. గతంలో అధికార పక్షం మీడియా స్వేచ్ఛను కాలరాసింది అని విన్నాం,కానీ ఇప్పడు ప్రతిపక్షమే ఇలా మీడియా నోరు నొక్కేయడం చూస్తున్నాం అంటూ వ్యాఖ్యానించారు. అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణలో తొందరపాటు ఏమీ లేదని, తప్పులపై విచారణ జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ఏదైనా చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అంటున్నారంటూ సజ్జల అసహనం వ్యక్తం చేశారు. అమరావతి భూములపై విచారణకు నియమించిన సిట్ స్వతంత్ర విచారణ సంస్థ అని సజ్జల స్పష్టం చేశారు.