ఆయన నాయకత్వ మార్పు కేవలం ఊహాగానమే: మంత్రి అశోక్

వాస్తవం ప్రతినిధి: కర్ణాటక లో ప్రస్తుతం బీజేపీ సర్కార్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ సీనియర్ నేత బీ ఎస్ యడియూరప్ప సీఎం గా వ్యవహరిస్తుండగా ఆయన నాయకత్వం పై ఇటీవల కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఆయనను సీఎం పదవి నుంచి తప్పించి వేరొకరికి భాద్యతలు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ఆర్. అశోక్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఎస్‌ యడియూరప్ప నాయకత్వ మార్పు ఎట్టి పరిస్ధితిలోనూ సాధ్యంకాదని, మిగిలిన మూడేళ్లూ ఆయనే సీఎంగా కొనసాగనున్నారంటూ ఆయన తేల్చిచెప్పారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

నాయకత్వ మార్పు కేవలం ఊహాగానమేనంటూ కొట్టిపారేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధీటుగా ఎదుర్కొనే రాజకీయ చాణక్యం యడియూరప్ప సొంతమన్నారు. ఏ బంతిని విసిరినా దాన్ని సిక్సర్‌ వైపునకు పంపే సత్తా ఆయనకు ఉందన్నారు. అధిష్ఠానం ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు బీజేపీ నేతలను దువ్వుతోందన్న కథనాలను ఆయన తోసిపుచ్చారు. ఇలాంటి ఊహాగానాలపై తాను స్పందించబోనని, ఏడుపదుల వయసు దాటినా యడియూరప్ప చాలా చలాకీగా పనిచేస్తున్నారని మంత్రి అశోక్‌ ప్రశంసలు గుప్పించారు. కర్ణాటకలో బీజేపీకి గట్టి పునాదులు వేయడమే కాకుండా దక్షిణాదిన తొలిసారి కమల వికాసానికి రాచబాటలు వేసిన ఘనత యడియూరప్పదేనంటూ ఆయన ప్రశంసించారు.