తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు తిరిగి ఉన్నది.ఇది మరింత బలపడడంతో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది.

ఇటు తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. సోమవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పిడుగులు కూడా పడ్డాయి.

ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మిగతా చోట్ల చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు జిల్లాల్లో చెరువులు పూర్తిగా నిండిపోయాయి. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరుచేరింది. అటు తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.