బాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి అనిల్

వాస్తవం ప్రతినిధి: టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూలావాదేవీలపై విచారణ జరపాలి అంటూ ఏపీ జగన్ సర్కార్ ఏసీబీ కేసును నమోదు చేసిన నేపథ్యంలో మంత్రి అనిల్ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి లో భూకుంభకోణం జరిగింది అని దీనిపై సీబీఐ విచారణను స్వీకరించే దమ్ము బాబుకు ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో సీబీఐ విచారణ జరిపించాలి అని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ కు తాము కూడా సహకరిస్తాం అంటూ ఆయన లేఖ రాయగలరా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అమరావతి లో భూఆక్రమణలు జరిగాయని ఆరోపించిన మంత్రి అసలు అక్రమాలు జరగకపోతే ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారు అంటూ అనిల్ అడిగారు.. అలానే ఫైబర్ గ్రిడ్ లో కూడా భారీ గా అవినీతి జరిగింది అని మంత్రి ఆరోపించారు.