జపాన్‌ కొత్త ప్రధానిగా యోషిహిడే సుగా..!!

వాస్తవం ప్రతినిధి: జపాన్‌ కొత్త ప్రధానిగా యోషిహిడే సుగా బాధ్యతలు చేపట్టనున్నారు. జపాన్‌ అధికార పార్టీకి నూతన సారథిగా యోషిహిడే సుగా ఎంపికయ్యారు. అధికార లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ(ఎల్‌డీపీ) సోమవారం ఆయనను తమ నేతగా ఎన్నుకున్నది. అధికార లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ అంతర్గత ఎన్నికల్లో 377 ఓట్లు సాధించిన సుగాను కాబోయే జపాన్‌ ప్రధానమంత్రిగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేసిన షింజో అబే స్థానంలో ఈయన ఎంపికయ్యారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా కొనసాగుతున్న షింజో అబే అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడి, పతనమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం తన తక్షణ ప్రాధమ్యాలని సుగా పేర్కొన్నారు. మాజీ ప్రధాని అబే ప్రాధమ్యాలను ఈయనా కొనసాగిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. బుధవారం సుగాను జపాన్‌ ప్రధానిగా అధికారికంగా ప్రకటించనున్నారు. ఆయన 2021 సెప్టెంబరు దాకా పదవిలో కొనసాగుతారు.