వీసా గడువు ముగిసిన వారికి కువైట్ స‌ర్కార్ కీల‌క సూచ‌న‌..!!

వాస్తవం ప్రతినిధి: మ‌హ‌మ్మారి క‌రోనా నేప‌థ్యంలో కువైట్ ప్ర‌భుత్వం మార్చిలో రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారికి న‌వంబ‌ర్ చివ‌రి వ‌ర‌కు గ్రేస్ పిరీయ‌డ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ పొడిగింపు సెప్టెంబ‌ర్ 1 తర్వాత వీసా గ‌డువు ముగిసిన వారికి వ‌ర్తించ‌ద‌ని తాజాగా కువైట్ స‌ర్కార్ వెల్ల‌డించింది. రెసిడెన్సీ వ్య‌వ‌హారాల శాఖ వారు జూన్ చివ‌రి నుంచే వీసా పున‌రుద్ధ‌ర‌ణ ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌డం ప్రారంభించారు క‌నుక సెప్టెంబ‌ర్ 1 త‌ర్వాత వీసా గ‌డువు ముగిసిన వారు త‌మ వీసాల‌ను పున‌రుద్ధ‌రించుకోవాల‌ని అధికారులు సూచించారు. సెప్టెంబ‌ర్ 1 తర్వాత రెసిడెన్సీ వీసా గ‌డువు ముగిసిన వారు రెన్యూవ‌ల్ చేసుకోకుంటే రోజుకి రెండు కువైట్ దిర్హామ్‌(రూ.480) జ‌రిమానా క‌ట్టాల్సి ఉంటుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.