రాజ్యసభలో పోలవరం ప్రస్తావన..!!

వాస్తవం ప్రతినిధి: వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక ప్రాజెక్టు పోలవరం ప్రస్తావన తీసుకొచ్చారు. అనేక ఇబ్బందులు ఉన్నా గాని, వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శతవిధాల కష్టపడుతున్నట్లు తెలియజేశారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధులను విడుదల చేయాలని రాజ్యసభలో కోరారు విజయసాయిరెడ్డి. ఈ అంశంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోడీ కి లెటర్ కూడా రాయటం జరిగిందని గుర్తు చేశారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అని ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి నిధులు మొత్తం కేంద్రమే చెల్లించాలని, కాబట్టి వచ్చే ఏడాది చివరికల్లా పూర్తవ్వాలంటే కేంద్రం సహకరించాలని విజయసాయి రెడ్డి కోరారు. మొత్తం మీద కేంద్రం నుండి 3805 కోట్లు రావాల్సి ఉందని, వెంటనే రిలీజ్ చేస్తే పనులు త్వరితగతిన అవుతాయని విజయసాయి రెడ్డి తెలిపారు.