ఏపీ ఆర్థిక ఆదాయం పెంచుకోవడానికి సరికొత్త ఎత్తుగడ వేసిన వైసీపీ సర్కార్..??

వాస్తవం ప్రతినిధి: విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి ఎవరు వచ్చిన ఎలాంటి ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా అప్పులు చేసి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చవలసిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ జగన్ సర్కార్ కూడా ఎక్కువ అప్పులు చేస్తున్నట్లు విపక్షాలు మండిపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీ ఖజానా నింపడానికి జగన్ సర్కార్ సరికొత్త ఎత్తుగడ వేసినట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

పైగా కరోనా వైరస్ రావటంతో ఇబ్బందులు ఎక్కువ అవటంతో వచ్చే ఆదాయాలు కూడా దారుణంగా పడిపోయాయి. గడిచిన ఐదారు నెలల్లో మహమ్మారి కరోనా వైరస్ వల్ల దాదాపు 15 వేల కోట్ల ఆదాయం కోల్పోయినట్టు లెక్కల అంచనా. ఒకవైపు ఆదాయం తక్కువ మరోవైపు ఖర్చులు ఎక్కువైపోయాయి. సంక్షేమ పథకాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో నిధుల సమీకరణకు దృష్టి పెట్టాలని అధికారులకు ఇటీవల సీఎం జగన్ తెలియజేశారట.

దీంతో పన్నులను పెంచే దిశగా జగన్ సర్కార్ రెడీ అయినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత మద్యంపై 75 శాతం పన్ను , ఆ తరువాత భూములపై ఇదే రీతిలో వృత్తి పన్ను పెంచడంతో పాటు తాజాగా నాచురల్ గ్యాస్ పై పన్ను పెంచడంతో, అదనపు ఆదాయం పన్ను పెంపు విధానం ద్వారా రాబడుతున్నట్లు ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.