అమెరికాలో కృష్ణా జిల్లా యువతి మృతి..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో జరిగిన ప్రమాదం కృష్ణా జిల్లాలో విషాదం నింపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మరణించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన పోలవరపు లక్ష్మణరావు ఇద్దరు కూతుర్లలో పోలవరపు కమల బీటెక్ పూర్తి చేసింది. కొంత కాలం క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం సంపాధించి కొలంబియలో ఉంటోంది. కమల తనకు కాబోయే భర్తతో కలిసి అట్లాంటాలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో వారిద్దరూ బాల్డ్ రివర్ వాటర్ ఫాల్స్ వద్ద ఆగారు. జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు.

ఈ ప్రమాదంలో పోలవరపు కమల మృతి చెందగా.. సదరు యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో రెస్క్యూ టీం ఆమె మృతదేహాన్ని బయటకు తీసింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. నాట్స్‌ సహకారంతో ఆమె శవాన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూతురి మరణ వార్త విని ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకున్న యువతి అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.