బీజేపీకి పవన్ దూరమవుతాడా..?? బాబు స్కెచ్ వర్కౌట్ అవుతుందా..??

వాస్తవం ప్రతినిధి: ఏపీలో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోంది. ఎన్నో ఆటు పోట్లు తట్టుకున్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఎన్నికల కోసం ఇప్పటి నుంచి సిద్దమవుతున్నారు. గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ తానేంటో నిరూపించుకునేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. అలాగే ఏపీలో పాగా వేయాలని ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ పవన్ తో జట్టు కడితేనే ఏపీలో తాము అనుకున్నది సాధించవచ్చని ఏపీలో జనసేనతో కలిసి భవిష్యత్తు ఎన్నికల కోసం పనిచేస్తున్నట్టుగా ప్రకటించింది…

ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన దోస్తీ కట్టడంతో ఒంటరిగా మిగిలిపోయిన టీడీపీ మరో సారి బీజేపీతో జట్టుకట్టడానికి ఆశగా ఎదురు చూస్తోంది. భవిష్యత్తులో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశాలు లేకపోవడంతో పాటు, తమ పార్టీ క్యాడర్ జారిపోకుండా ఉండాలంటే కేంద్రంతో జట్టుకట్టక తప్పదనే భావనలో ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే బాబు బీజేపీ నుంచి పవన్ ని దూరం చేసి తాను దగ్గరయ్యేందుకు కొత్త స్కెచ్ వేశారని రాజకీయ వర్గాలలో పెద్ద చర్చే నడుస్తోంది..అదేంటంటే..

బీజేపీ పెద్దలని ఆకర్షించడానికి బాబు కొత్తగా ఆలయాలలో పూజలను బీజేపీకి ఎరగా వేస్తున్నారని, వారం రోజుల పాటు ప్రముఖ దేవాలయాల్లో పూజల పేరిట హడావిడి చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన కారణం అదేనని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు బీజేపీ ఊహించిన స్థాయిలో పవన్ కళ్యాణ్ ఏపీలో పలు అంశాలపై స్పందించలేక పోతున్నాడని, కేవలం తాము మాత్రమే రధం ఘటన విషయంలో న్యాయం కోసం పోరాడుతున్నామన్నట్టుగా సంకేతాలు పంపడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నారు. పవన్ ని బీజేపీ నుంచి దూరం చేస్తే తాము కేంద్రానికి దగ్గరయ్యి మరో సారి బీజేపీ కూటమితో అధికారంలోకి రావచ్చనేది బాబు వ్యూహంగా అభివర్ణిస్తున్నారు రాజకీయ పండితులు..