కరోనా వల్ల ఆ జిల్లా లో సంపూర్ణ లాక్ డౌన్ …..

వాస్తవం ప్రతినిధి:  నగరాలను అల్లాడించిన కరోనా మహమ్మారి గ్రామాల్లోకి కూడా చొచ్చుకుపోతుంది. తొలుత శ్రీకాకుళం లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకుండా రికార్డ్ కెక్కగా ఇప్పుడు ఆ జిల్లా లో కూడా కరోనా టెర్రర్ పుట్టిస్తుంది. ఏపీలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే . వివిధ జిల్లాల్లో రికార్డు స్థాయిలో కేసులు గుట్టలుగా నమోదు అవుతుండగా శ్రీకాకుళం జిల్లాలో కూడా కరోనా విజృంభిస్తుంది. దీనితో శ్రీకాకుళం పట్టణంలో ఈ రోజు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రకటించారు.

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని…. కూరగాయల మార్కెట్లు, చికెన్, మటన్, చేపల మార్కెట్లు కూడా తెరవరని తెలిపారు‌. పాలు, బ్రెడ్ మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు. అయితే అత్యవసర వైద్య సేవలను వినియోగానికి ఎటువంటి ఆటంకం లేదని, అంబులెన్సులు, వైద్య వాహనాలకు అనుమతి ఉందని కలెక్టర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సొంత వాహనాల్లో వైద్యం నిమిత్తం వెళ్తే.. వాహనాలకు ఎలాంటి ఆటంకం ఉండదని కానీ  ప్రతి ఒక్కరూ మాస్కుతో పాటు ఫేష్ షీల్డ్ ధరించాలని వివరించారు.

వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని.. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని ఆయన అన్నారు.  లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని కూడా హెచ్చరించారు. శ్రీకాకుళం పట్టణంలో కేసులు అధికంగా పెరుగుతున్నందున  లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని స్పష్టంచేశారు.