ప్రైవేటు బస్సు బీభత్సం..ఇంట్లోకి దూసుకెళ్ళి..

వాస్తవం ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డుపక్కనే ఉన్న ఓ ఇంటిలోకి నేరుగా దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇంట్లోనే నిద్రిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు అందించిన వివరాల ప్రకారం..

శనివారం తెల్లవారుజామున కూసుమంచి మండలం నాటకన్‌ గూడెంలో ఇది చోటు చేసుకుంది.
ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు ఓ ప్రైవేటు బస్సు బయలుదేరింది. ఆ సమయంలో శనివారం తెల్లవారుజామున నాటకన్‌ గూడెంలో అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. అందులో నిద్రిస్తున్న కృష్ణారెడ్డి, ఆయన భార్య వెంకటమ్మ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ నిద్రమత్తులో నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ఇది జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రయాణికులు వేరే వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.