బీరుట్‌ నౌకాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం..!!

వాస్తవం ప్రతినిధి: లెబనాన్ రాజధాని బీరుట్‌లో పోర్టులో గత నెలలో జరిగిన భారీ పేలుడు నుంచి లెబనాన్ ప్రజలు కోలుకోకముందే వారిని భయాందోళనకు గురిచేసే మరో ఘటన అదే ప్రదేశంలో జరిగింది. గురువారం పోర్టులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి.

ఓడరేవు వద్ద డ్యూటీ ఫ్రీ జోన్‌లో చమురు, టైర్లను ఉంచి గిడ్డంగి వద్ద మంటలు చెలరేగినట్లు లెబనీస్‌ సైన్యం పేర్కొంది. మంటలను అదుపులోకి తెస్తున్నట్లు, ఆపరేషన్‌లో ఆర్మీ హెలికాప్టర్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ ఘటనతో మరోసారి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఫైర్‌ ఇంజిన్లు త్వరగా కదిలేందుకు ఓడరేవుకు వెళ్లే రహదారులకు దూరంగా ఉండాలని బీరుట్‌ ప్రభుత్వం మార్వాన్ అబౌద్, అధికారులు ప్రజలను కోరారు. పోలీస్‌ ప్రతినిధి కల్నల్‌ జోసెఫ్‌ మసలాం మాట్లాడుతూ ఓడరేవులో ఏం జరుగుతుందో తమకు సమాచారం లేదని, ఆ ప్రాంతం సైన్యం నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాకెక్కడంతో బీరుట్ ప్రజలు మరోమారు భయంతో వణికిపోయారు.