మరోసారి నోరుజారిన బిడెన్ ..!!

వాస్తవం ప్రతినిధి: నవంబర్ లో అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపధ్యంలో బుధవారం మిచిగాన్‌లోని వారెన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిడెన్.. కరోనా మరణాలపై మరోసారి తప్పులో కాలేసాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిడెన్… ఇప్పటివరకు కొవిడ్ 6వేల మంది అమెరికన్ ఆర్మీని పొట్టనబెట్టుకుందని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరు వేల మరణాలు అనేది మిచిగాన్‌లో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య. కానీ, బిడెన్ పొరపాటున కొవిడ్‌తో మరణించిన యూఎస్ మిలిటరీ సంఖ్యగా తెలియజేశారు. కాగా, మిచిగాన్‌లో ఇప్పటివరకు 118,984 మంది కరోనా బాధితులు ఉండగా… 6,114 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇలాగే జూన్‌లో కూడా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కొవిడ్ వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 120 మిలియన్ల మంది మరణించారని తప్పుగా చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో యూఎస్ వ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారు కేవలం లక్ష 20 వేల మంది మాత్రమే.