ప్రపంచ దేశాలకు WHO వార్నింగ్..!!

వాస్తవం ప్రతినిధి : కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. వైర‌స్ క‌ట్ట‌డి కోసం అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్ల‌డంతో ఆర్థిక సంక్షోభాల‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో హెచ్చరిక చేసింది. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నవేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ మరో సంచలన హెచ్చరిక చేశారు.

“ఇదే చివరి మహమ్మారి కాదు” అని జెనీవాలో ఒక వార్తా సమావేశంలో పేర్కొన్నారు. ప్రపంచం తదుపరి మహమ్మారికి సిద్ధంగా ఉంటే మంచిది అని హెచ్చరించారు. క‌రోనా మ‌హ‌మ్మారే చివ‌రి మ‌హ‌మ్మారి కాద‌ని.. ఇలాంటి వైర‌స్‌లు, మ‌హ‌మ్మారులు భవిష్యత్తులో మరిన్ని ఎదుర్కొనేందుకు ప్ర‌పంచం సిద్ధంగా ఉండాల‌ని పిలుపు ఇచ్చారు. స్పానిష్ ఫ్లూ, సార్స్, మెర్స్‌, ఎబోలా, స్వైన్ ఫ్లూ వంటి ఎన్నో వైర‌స్‌లు విజృంభిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు మాన‌వాళికి స‌వాల్ విసురుతున్నాయ‌ని.. కేవ‌లం క‌రోనా వైర‌స్తోనే ప్ర‌మాదం ఇప్పుడు రాలేద‌ని అన్నారు. ఇక భ‌విష్య‌త్తులోనూ మ‌ర‌న్నె వైర‌స్‌ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు ప్రజారోగ్యంపై మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.