బాలీవుడ్ ట్విట్టర్ యూజర్ కు ‘వై’ సెక్యూరిటీ అవసరమా?: తృణమూల్ ఎంపీ

వాస్తవం ప్రతినిధి: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు, మహారాష్ట్ర లో అధికారంలో ఉన్న శివసేన నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సేన నేతలకు కంగనా సవాల్ కూడా విసిరింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కంగనా భద్రత విషయం లో కీలక నిర్ణయం తీసుకుంది.

ఆమెకు ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడం తో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక బాలీవుడ్ ట్విట్టర్ యూజర్ కు అంత భద్రత ఎందుకు అంటూ ఆమె ప్రశ్నించారు. దేశంలో లక్షమంది జనాభాకు 138 మంది పోలీసులు మాత్రమే అందుబాటులో ఉన్నారని తెలిపారు. అలాంటిది ఒక ట్విట్టర్ యూజర్ కు వై కేటగిరి భద్రత కల్పించడం అవసరమా అంటూ ఆమె ప్రశ్నించారు. దేశంలోని వనరులను సక్రమంగా వినియోగించడం ఇలాగేనా? అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆమె నిల‌దీశారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన కంగనా తీవ్ర స్థాయిలో అందరిపై మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మరో పీవోకే ను తలపిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేయడం తో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీనితో సేన నేతలు ఆమె ముంబై రాకూడదు అని,ఆమెను తిరిగి పీవోకే కె పంపించాలి అంటూ వ్యాఖ్యలు చేయడం తో కంగనా సెప్టెంబర్ 9 న ముంబై కి వస్తున్నానని దమ్ముంటే ఎవరైనా ఆపండి అంటూ సవాల్ విసిరింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.