వాస్తవం ప్రతినిధి : భారత సైనికులు మాత్రం మానవత్వంతో చైనా ప్రజలను కాపాడుతోంటే.. చైనా సైనికులు మాత్రం భారతీయులను కిడ్నాప్ చేస్తున్నారు. ఉత్తర సిక్కింలోని వాస్తవాధీన రేఖ సమీపంలో దారితెలియక ఎత్తైన పీటభూమిపై తీవ్రమైన చలిలో చిక్కుకు పోయిన ముగ్గురు చైనీయులకు ఆహారాన్ని అందించి ఆదుకున్న సంగతి మనకు తెలిసిందే. వారికి దారి చూపించి గమ్యస్థానానికి చేరుకునేలా సాయం చేశారు. ఇదిలా ఉంటే చైనా సైనికులు మాత్రం భారతీయులను కిడ్నాప్ చేస్తున్నారు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న దశలో చైనా ఓ దుశ్చేష్టకు పాల్పడింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ ఐదుగురు భారతీయులను చైనా బలగాలు అపహరించాయి. అప్పర్ సుబన్సిరి జిల్లాలోని నాచో ప్రాంతంలో అడవిలో వేటకు వెళ్లిన వారిని చైనా దళాలు కిడ్నాప్ చేశాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అప్పర్ సుబన్సిరి జిల్లాకు చెందిన ఐదుగురు వేటగాళ్లను ఈ నెల 3న కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
నాచో గ్రామానికి చెందిన ఈ వేటగాళ్లు భారత్-చైనా సరిహద్దు అయిన మెక్‌మోహన్ రేఖ దగ్గర ఉన్న అడవిలోకి వేటకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. వేటగాళ్లందరూ స్థానిక తగిన్ తెగకు చెందిన వారని తెలుస్తోంది. ఆ ఐదుగురితో పాటు ఉన్న మరో ఇద్దరు తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది బయటపడింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్‌కు గురైన వారిని ప్రసాద్ రింగ్లింగ్, తను బాకర్, ఎన్గరి దిరి, దొంగ్తు ఇబియా, టోచ్ సిగకమ్గా గుర్తించారు. దీనిపై దర్యాప్తు సాగుతోంది. చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటి భారత అడవుల్లోకి జొరబడ్డాయని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ – ప్రధాని కార్యాలయానికి పంపిన ఓ ఫిర్యాదులో పంపారు.