బానిసత్వపు పోకడ మారెదెలా ?

పాలేరు అంటే పని వాడు అని అర్ధం. సాధారణంగా శారీరకంగా గాని, ఆలోచనా శక్తిలో గాని బలహీనంగా ఉన్న వాళ్ళు, వారి ఆర్ధిక అవసరాలను సమకూర్చుకోలేక వేరే వాళ్ళ దగ్గర పాలేరు తనం చేస్తూ బతుకుతారు. పాలేరుగా చేసే వాళ్లకి స్వతంత్ర ఆలోచనలు ఉండవు. ఉన్నాకూడా వాటిని గుర్తించ లేని పరిస్థితి, కొన్ని తరాలుగా మనం ఇలాగే ఉండాలి అని శాసించబడిన సామజిక పరిస్థితుల వలన. అధికారి చెప్పిన పని చేయటం మాత్రమే వారి కర్తవ్యం. వారి ఆలోచనా విధానం ఆవిధంగా మలచబడింది.

ఈ పాలేర్లలో రెండు రకాలు ఉంటారు. ఇంటి పాలేరు, పొలం పాలేరు.

పొలం పాలేరు పొలం లో పని చేస్తూ ఉంటాడు. రోజంతా అక్కడ పని చేసి రాత్రి అయ్యేసరికి  పొలంలోనే తన యజమాని నిర్దేశించిన ఒక మూల పడుకుంటాడు. మర్నాడు మళ్ళీ అదే పని. ఇది ఇతని జీవితం. ఇతని జీవితంలో పెద్దగా మార్పులు ఉండవు. ఎపుడైనా చైతన్యం వచ్చి, తన శక్తిని అంతటినీ యజమానికి ధారపోస్తున్నాను అనే ఊహ వచ్చినా, యజమానిని ఎదిరించే ధైర్యం కానీ, బయటకి పోవాలి అనే తెగువ కానీ ఇతనిలో ఉండదు.

ఇక ఇంటి పాలేరు – ఇతను యజమానికి సంబంధించిన ఇంటి పని చేస్తూ ఉంటాడు. రాత్రి పూట యజమాని ఉండే విలాసవంతమైన భవనంలో ఒక మూల పడుకుంటాడు. యజమాని తిన్న భోజనంలోనే చివరగా మిగిలి పోయిన భోజనం తింటూ ఉంటాడు. అంటే ధనికుల భోజనం, వసతి అన్న మాట. అలాగే, యజమాని వాడటం మానేసిన, చినిగిన బట్టలు, ఇతర వస్తువులూ ఈ ఇంటి పాలేరు కి పడేస్తూ ఉంటారు… బయట పడేసే బదులు. దీని వలన ఇంటి పాలేరు కి యజమాని మీద విపరీతమైన ఆరాధనా భావం. యజమాని ఎంతో మంచి వాడు అనే అనుకుంటూ ఉంటాడు. యజమాని లేక పోతే తనకి ఈ జీవితం లేదు అని బలంగా నమ్ముతాడు. పొలం పాలేరులా తిరుగు బాటు చేయాలి అనే ఆలోచన ఎప్పుడు రాదు. యజమాని దగ్గర నమ్మిన బంటులాగా, ఒక బానిస లాగా బ్రతుకుతూ ఉంటాడు.

ఇక యజమాని, ఈ పాలేర్లలో ఎవరు చైతన్యంగా ఉంటారో వాళ్ళని ఇంటి పాలేర్లు గా నియమిస్తూ ఉంటాడు. పొలం పాలేరు ఎవరైనా తిరుగుబాటు చేయాలి అనే ధోరణి చూపిస్తే వాళ్లకి ఇంటి పాలేరుగా స్థానచలనం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎప్పుడు తన అధికారానికి ముప్పు రాకుండా చూసుకుంటూ ఉంటాడు.

ఈ ఇతివృత్తం మనం మన చుట్టూ వివిధ రకాలుగా చూస్తూనే ఉంటాం. శ్రీ శ్రీ గారు ‘ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం’ అన్నది ఈ యజమానులని చూసే అనుకుంటా. కానీ, ఒక వైపు రాచరిక వ్యవస్థలు పోయి, ప్రజాస్వామ్య వ్యవస్థలు బలపడుతున్నా, మరో వైపు సాంకేతిక, వైజ్ఞానిక మేధస్సు పెరుగుతున్నా కూడా కొన్ని వర్గాలు ఇంకా పాలేర్లుగానే ఉండటానికి కారణం ధనిక యజమానుల కుయుక్తులా లేక ఇంటి పాలేర్ల హ్రస్వ దృష్టా?

అసలు ఈ పాలేరు తనం పోయి, ఎవరి శక్తికి తగ్గ పనులు వాళ్ళు చేసుకోగలిగే పరిస్థితి రావాలి అంటే పొలం పాలేర్లు, ఇంటి పాలేర్లు కలిసి పోరాడాలి. దానికి ఒక దశ దిశా చూపగలిగే నాయకుడు కావాలి. అలంటి నాయకుడు వచ్చినపుడు కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. ముఖ్యంగా ఇంటి పాలేర్ల నుండి. పొలం పాలేర్లు కూడా అంత త్వరగా ముందుకి రారు. మార్పు అనేది మంచిదైనా కూడా కష్టమే… కానీ మంచి మార్పుని ఊహించి దాని కోసం నిరంతరం శ్రమించే నాయకులు కాడి వదలరు. ఒక మాల్కమ్-X , ఒక పవన్ కళ్యాణ్.

*పవన్ కళ్యాణ్ గారికి 50వ జన్మదిన శుభాకాంక్షలు*

*నల్లం చంద్ర శేఖర్*
బోస్టన్, సెప్టెంబర్ 2, 2020