మహీ ని ప్రశంసల్లో ముంచెత్తిన బీసీసీఐ బాస్

వాస్తవం ప్రతినిధి: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. మహీ అరుదైన రకం ఆటగాడని దాదా పేర్కొన్నాడు. ధోనీకి అద్భుతమైన భారీ హిట్టింగ్‌ నైపుణ్యం ఉందని, అందుకే కెరీర్‌ మొదట్లో అతడిని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపి షాట్లు ఆడేందుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని దాదా చెప్పాడు. కెరీర్‌ మొత్తం ధోనీ టాపార్డర్‌లో ఆడి ఉంటే మరింత గొప్ప ఆటగాడయ్యేవాడని బీసీసీఐ బాస్ చెప్పుకొచ్చాడు.

ఆదివారం ఓ ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ…. ‘ఎంఎస్ ధోనీకి భారీ షాట్లు ఆడగల నైపుణ్యం ఉంది. ఓ సారి ఛాలెంజర్‌ ట్రోఫీలో నా జట్టు తరపున ఓపెనింగ్‌ ఆడి.. సెంచరీ చేశాడు. తన సామర్థ్యం గురించి తెలుసు కాబట్టే.. వైజాగ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపా. ఆ మ్యాచ్‌లో మహీ అద్భుతంగా ఆడి 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత కూడా ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారీ భారీ స్కోర్లు చేశాడు’ అని తెలిపాడు.