సురేశ్‌ రైనాను ప్రశంసిస్తూ ప్రధాని మోడీ లేఖ!

వాస్తవం ప్రతినిధి: ఆగస్టు 15న టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇచ్చి యావత్‌ క్రీడాలోకాన్ని షాక్‌కు గురిచేశాడు. వీడ్కోలుపై ప్రతీఒక్కరూ మాట్లాడుతూ.. రైనా టీమిండియాకు చేసిన సేవల్ని, సాధించిన విజయాలను గుర్తుచేసుకునున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పాటు సురేశ్‌ రైనాకు కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఓ సుదీర్ఘ లేఖ రాశారు.

ప్రధాని నరేంద్ర మోదీ రెండు పేజీల లేఖలో సురేశ్‌ రైనాను ప్రశంసిస్తూ ఇలా రాసుకొచ్చారు. ‘సురేశ్‌ రైనా.. ఆగస్టు 15న మీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ దానిని నేను రిటైర్మెంట్‌ అనే పదంతో పిలవలేను. ఎందుకంటే.. ఇంకా మీకు ఆడే సత్తా ఉంది. ఎంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ ప్లేయర్‌గా కనిపించే మీరు ఇంత త్వరగా ఆటకు వీడ్కోలు పలుకుతారని ఊహించలేదు. బ్యాట్స్‌మన్‌ గానే కాకుండా బౌలర్‌గానూ మీ సారథికి ఉపయోగపడ్డారు. మీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ సజావుగా సాగాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని మోదీ లేఖలో పేర్కొన్నారు.