వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ మంగళవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాలిఫోర్నియాకు చెందిన భారత సంతతి సెనెటర్ కమలా హారిస్‌ను తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఈ అవకాశం దక్కించుకున్న తొలి శ్వేత జాతీయేతర మహిళగా కమల చరిత్రకెక్కారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిపారు. వైస్ ప్రెసిడెంట్‌గా మహిళను ఎంచుకుంటానని ఇప్పటికే ప్రకటించిన బిడెన్ ఈ పదవికి మొదటి నల్లజాతి మహిళను పోటీలో నిలిపి చరిత్ర సృష్టించారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇది తన విజయానికి మరింత ఊతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన బిడెన్… “దేశంలోని అత్యుత్తమ ప్రజా సేవకులలో కమలా ఒకరు. మీతో కలిసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించబోతున్నాం. కమలా హారిస్‌ను నెంబర్ టూగా ప్రకటించడం నాకు గొప్ప గౌరవంగా ఉంది. ఎన్నికలు ముగిసే వరకూ తన ప్రచారంలో ఆమె భాగస్వామిగా ఉంటారు. తమ భాగస్వామ్యంతో విజయం మరింత సులువవుతుందని భావిస్తున్నానని” అన్నారు. యూఎస్ ఉపాధ్యక్ష బరిలో భారత సంతతి మహిళ ఉండటంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కమలా హరిస్ కూడా బిడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. బిడెన్ అధ్యక్షుడు అయితే మన జీవితాలు మరింత మెరుగుపడతాయని ఆమె ట్వీట్ చేశారు.