భారతీయులకు తీపి కబురు చెప్పిన యూఏఈ..!!

వాస్తవం ప్రతినిధి: యూఏఈలోని భారత రాయబారి శుభవార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో ప్రపంచ దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని చాలా దేశాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం కూడా అన్ని రకాల వీసాలను జారీ చేస్తూ.. తమ దేశంలోకి విదేశీ పౌరులను అనుమతిస్తోంది. విజిట్ వీసా మీద యూఏఈకి వెళ్లాలనుకునే భారతీయులకు.. యూఏఈలోని భారత రాయబారి తీపి కబురు చెప్పారు.

విజిట్ వీసాతో భారతీయులు.. యూఏఈలో పర్యటించేందుకు భారత ప్రభుత్వం మార్గం సుగమం చేసినట్లు పవన్ కపూర్ చెప్పారు. భారత ప్రభుత్వం అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో ద్వైపాక్షిక ‘ఎయిర్ బబుల్’ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల పౌరులు ఇండియాకు రావడానికి అనుమతిచ్చింది. ఇదే సమయంలో భారతీయులు కూడా ఆయా దేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో యూఏఈతో కూడా ‘ఎయిర్ బబుల్’ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలంటూ తాను భారత ప్రభుత్వాన్ని కోరినట్లు పవన్ కపూర్ వెల్లడించారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య దైపాక్షిక ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందంతో భారతీయులు.. విజిట్ వీసాతో యూఏఈలో పర్యటించేందుకు మార్గం సుగమం అయిందని అభిప్రాయపడ్డారు.