వందే భారత్ మిషన్: యూఏఈ నుంచి సురక్షితంగా ఇండియా చేరుకున్న భారతీయులు!

వాస్తవం ప్రతినిధి: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి.  కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను మే 7న ప్రారంభించింది. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 9.5లక్షల మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నారు. ఇదే సమయంలో భారత్‌లో చిక్కుకున్న సుమారు 1.16 లక్షల మంది ప్రవాసులు విదేశాలకు వెళ్లారు. ఇది ఇలా ఉండగా.. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా యూఏఈలో చిక్కుకున్న 114 మంది భారతీయులు.. ఆదివారం రోజు స్వదేశానికి చేరుకున్నారు. 114 మందితో యూఏఈలో బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. మధ్యప్రదేశ్‌లోని దేవీ అహల్యాబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న సాయంత్రం ల్యాండ్ అయింది. కాగా.. యూఏఈ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరినీ క్వారెంటైన్ కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు.