కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది: రామ‌కృష్ణ

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ప్ర‌తిరోజు 10వేల కేసులు న‌మోద‌వుతుండ‌టంపై సీపీఐ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పారాసిట‌మాల్, బ్లీచింగ్ పైడ‌ర్ తో క‌రోనా త‌రమొచ్చంటూ సీఎం తేలిక వ్యాఖ్య‌లు చేశార‌ని, స‌రైన వైద్యం, ఆహారం అంద‌క ఏపీలో క‌రోనా రోగులు ఇబ్బందిప‌డుతున్నార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కి రామకృష్ణ లేఖ రాశారు.

కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తెలంగాణలో 675 మరణాలు, 79 వేలు పాజిటివ్ కేసులుంటే ఏపీలో 2,27,000 కేసులు, 2 వేల మరణాలు న‌మోద‌య్యాయ‌న్నారు. మాస్కులు, పీపీఈ కిట్స్ ఇవ్వ‌టం లేద‌ని జూనియ‌ర్ డాక్ట‌ర్లు ఆందోళ‌న చెందుతున్న అంశాన్ని రామ‌కృష్ణ త‌న లేఖ‌లో ప్ర‌స్తావించారు. ఇంత‌టి ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోనూ సీఎం వివాదాస్ప‌ద అంశాల‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, ఇలాంటి స‌మ‌యంలో మూడు రాజ‌ధానుల విష‌యంపై ఫోక‌స్ చేశార‌ని లేఖ‌లో ఆరోపించారు.

వెంట‌నే రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపి, ప‌రిస్థితిని అంచ‌నా వేయాల‌ని రామ‌కృష్ణ కేంద్ర‌మంత్రిని కోరారు.