ఆ విషయంలో జగన్ తో రాజీపడే ప్రసక్తే లేదు అంటున్న కేటీఆర్..!!

వాస్తవం ప్రతినిధి: టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ సాక్షిగా ఆయన దృష్టికి వచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తూ నెటిజన్లకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసే పనుల గురించి వివరణ ఇస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇటీవల ట్విట్టర్లో “ASK KTR” అంటూ నెటిజన్లు నుండి వచ్చిన ప్రతి విషయానికి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.

ఈ మేరకు ఓ నెటిజన్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి అని ప్రశ్నించగా, దానికి కేటీఆర్ సమాధానం ఇస్తూ ఏపీ సీఎం జగన్ తో సత్సంబంధాలు బాగానే ఉన్నాయని తెలిపారు. అయితే కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. రాజకీయ నాయకులలో కేసీఆర్ కాకుండా మీకు నచ్చిన నాయకుడు ఎవరు అని ప్రశ్నించగా దానికి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అని అన్నారు.

ఇంకా తెలంగాణ రాష్ట్రం లో కరోనా పరిస్థితి గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 23వేల టెస్టులు నుండి 40 వేలకు కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచనున్నట్లు పేర్కొన్నారు. అదే రీతిలో రాష్ట్రంలో మెట్రో, సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ ట్రైన్ లు సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయని మరో నెటిజన్ ప్రశ్నించారు. దానికి కేటీఆర్ సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.