ఏకంగా పోలీసు ఇంటికే క‌న్న‌మేసిన ఘరానా దొంగలు

వాస్తవం ప్రతినిధి: నల్గొండ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసు ఇంటికే క‌న్న‌మేశారు. ఎస్‌ఐ ఇంటిని టార్గెట్ చేసి రూ.20లక్షల విలువైన సొత్తు దోచుకుపోయారు. నల్గొండలోని దేవరకొండ రోడ్డు న్యూ చైతన్యపురి కాలనీలో ఎస్ఐ లాక్యా నాయక్ ఫ్యామిలీతో కలిసి నివాసముంటున్నారు. ఆయన భార్య‌ సువర్ణ, కుమార్తె శ్రీలత ఈనెల 6న ప‌నుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. దీంతో దొంగ‌లు ఆ ఇంటిని టార్గెట్ చేశారు.

ఇంటికి వేసిన తాళాన్ని ప‌గల‌గొట్టి లోనికి ప్ర‌వేశించారు. మారుతాళంతో బీరువా ఓపెన్ చేసి..అందులో ఉన్న 20.25 తులాల బంగారు ఆభ‌రణాలు, రూ‌.8.50 లక్షల డ‌బ్బు ఎత్తుకెళ్లారు. త‌ర్వాతి రోజు ఉద‌యం త‌లుపులు ఓపెన్ చేసిన ఉండ‌టం గ‌మ‌నించిన స్థానికులు సువ‌ర్ణ‌కు స‌మాచారం ఇచ్చారు.

దీంతో ఆమె వెంటనే హైదరాబాద్‌ నుంచి ఇంటికి చేరుకున్నారు. బీరువాలోని బంగారు ఆభరణాలు, డ‌బ్బు కనిపించకపోవడంతో దొంగ‌త‌నం జరిగినట్లు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు ఇంట్లోనే చోరీ జ‌ర‌గ‌డంతో…ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకుని విచారణను వేగవంతం చేశారు పోలీసులు.