జో బిడెన్ అధ్యక్షుడైతే .. చైనా మన దేశాన్ని పాలించడం చాలా ఈజీ : ట్రంప్

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ట్రంప్ తన దూకుడు పెంచుతున్నారు. వచ్చే నవంబర్‌‌లో అగ్రరాజ్యం అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌ జరగనున్నాయి. అధికారంలో ఉన్న ట్రంప్ మరోమారు ప్రెసిడెంట్ అవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. ట్రంప్‌ను ఎలాగైనా ఓడించాలిన డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇద్దరు నేతల ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అమెరికాలో రానున్న నవంబర్‌ నెలలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థుల వాక్చాతుర్యం తీవ్రమైంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్‌పై దుమ్మెత్తి పోశారు. తనను ఓడించడం ద్వారా అమెరికాను చైనా పాలించాలని అనుకుంటోంది అని తీవ్రంగా ఆరోపించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోయి..తన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ గెలిస్తే చైనా పండగ చేసుకుంటుందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తాను రెండవసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలువకూడదని చైనా కోరుకుంటున్నదని, ఇది చైనాతోపాటు ఇరాన్‌కు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ట్రంప్ అన్నారు. నిద్రావస్థలో ఉన్న జో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండాలని చైనా కోరుకుంటున్నది. ఎందుకంటే, ఆయనను అడ్డుపెట్టుకుని అమెరికాను చైనా పాలించాలనుకుంటున్నది అని తీవ్రమైన ఆరోపణ చేశారు. జో బిడెన్ చేతిలో నేను ఓడిపోవాలని చైనా కోరుకుంటున్నదని, బీజింగ్ మన దేశాన్ని కొనాలనుకుంటుందని చెప్పారు. జో బిడెన్ అధ్యక్షుడైతే చైనాకు మన దేశాన్ని పాలించడం చాలా ఈజీ అని, ఇందుకోసం చైనా కలలు కంటున్నదని తెలిపారు.