హ్యాకర్లు రెచ్చిపోతున్నారు..జాగ్రత్త..!!

వాస్తవం ప్రతినిధి: క‌రోనాతో ల‌క్ష‌లాది మంది ఉద్యోగాలు కోల్పోగా… కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు.. ఇక‌, చాలా సంస్థ‌లు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఇచ్చాయి.. విద్యార్థులు ఆన్‌లైన్‌లో క్లాసులు వింటుఉన్నారు.. ఇలా.. ఇంట‌ర్నెట్ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది.. అయితే.. ఇది పెద్ద ప్ర‌మాదాల‌ను తెచ్చిపెడుతోంది.. ఈ ఏడాది హ్యాకర్ల దాడులు భారీగా పెరిగాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్య‌క్తం చేస్తోంది. మొదటి త్రైమాసికంలోనే దాదాపు 350 శాతానికి పైగా ఫిషింగ్ వెబ్‌సైట్ల ద్వారా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి కౌంటర్ టెర్రరిజం ప్రధానాధికారి వ్లాదిమిర్ వొరొంకోవ్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ సైబర్ దాడుల్లో అత్యధికంగా ఆస్ప‌త్రులు, ఆరోగ్య సంస్థలపైనే జరుగుతున్నాయని ఆయ‌న ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, అందుకే సైబర్ దాడులు కూడా విపరీతంగా పెరిగాయని వోరొంకోవ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా టెర్రరిస్టులు కొత్త వారిని చేర్చుకునేందుకు కూడా ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా మారాయని, ప్రపంచదేశాలు ఈ విపత్తుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయ‌న‌ సూచించారు.