మానవత్వం బతికే ఉందని నిరూపించిన ఎన్నారై..!!

వాస్తవం ప్రతినిధి: ఈ రోజుల్లో మనిషి జీవనం హడావుడిగా మారింది. ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో చాలా మంది బిజీ బిజీగా ఉంటారు. ఉదయం లేచిన మొదలు.. రాత్రి పడుకునే వరకు వాళ్ల పనులతో నిరంతరం హడావుడిగా కనిపిస్తూ ఉంటారు. సాటి మనిషి ప్రాణాలు పోతుంటే పట్టించుకొని మనుషులున్న ఈ రోజుల్లో.. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

కాలిఫోర్నియాలోని కింగ్స్ నది సమీపంలో ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలు.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. పిల్లలు నీటిలో కొట్టుకుపోవడాన్ని గమనించిన భారత సంతతి యువకుడు 29ఏళ్ల మంజీత్ సింగ్ .. నదిలోకి దూకి వారిని ఒడ్డుకు చేర్చాడు. ఈ క్రమంలో మంజీత్ సింగ్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి.. ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు , రెస్క్యూ బృందం ఘటనాస్థలానికి చేరుకుని .. నదిలోంచి మంజీత్ సింగ్ మృతదేహాన్ని బయటకి తీసారు. అసలు ఏమైంది అని పోలీసులు విచారిస్తే.. షాకింగ్ నిజం బయటపడ్డింది. నదిలో ప్రమాదవశాత్తు పడిన పిల్లలకు.. ఆ పిల్లలను కాపాడిన మంజీత్ సింగ్‌కు ఎటువంటి సంబంధం లేదని, పిల్లలను కాపాడాలనే ఉద్దేశంతోనే నదిలోకి దూకి.. ప్రమాదవశాత్తు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.