అగ్ని ప్రమాద ఘటన అత్యంత విషాదకరం: జనసేనాని 

వాస్తవం ప్రతినిధి:   విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా  ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పీఎం న‌రేంద్ర మోదీ కూడా సీఎం జ‌గన్‌కి ఫోన్ చేసి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

ఇక ఇదే విష‌యంపై జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్ల‌డుతూ..   ఈ ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. కరోనా వైరస్‌తో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినవారు ప్రమాదం బారినపడటం అత్యంత విషాదకరమని చెప్పారు.

మృతుల కుటుంబాలకు తమ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రమేశ్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా వినియోగిస్తోన్న స్వర్ణపాలెస్‌ హోటల్లో నడుస్తున్న ఈ కరోనా కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న విషయంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర హోటళ్లు, భవనాల్లోని కరోనా కేంద్రాల్లోనూ రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలని ఆయన అన్నారు.