మళ్లీ బ్యాట్‌ పట్టిన మహీ

వాస్తవం ప్రతినిధి: గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టాడు. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 మ్యాచులు మొదలవుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ధోనీ తన స్వస్థలమైన రాంచీలో నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. హెలికాప్టర్ షాట్లు త్వరలో చూస్తారని చెన్నై జట్టు స్టార్ ఆటగాడు సురేష్ రైనా చెప్పిన ఒక రోజు తర్వాత.. మహీ ప్రాక్టీస్ ఆరంభించడం విశేషం.

రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్‌లో ఐపీఎల్‌కు సిద్ధమయ్యే ప్రయత్నంలో ఎంఎస్ ధోనీ ఉన్నాడు. వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం రాంచీలో ఎక్కువ మంది బౌలర్లు అందుబాటులో లేనందున.. మహీ ప్రస్తుతానికి బౌలింగ్ మెషీన్లను ఎదుర్కొంటున్నాడట. సాధన సమయంలో భారీ సిక్సులు కొట్టినట్టు తెలుస్తోంది. ‘గత వారం జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్‌కు మహీ వచ్చాడు. ఇండోర్‌ స్టేడియంలో బౌలింగ్‌ మెషిన్‌ను ఉపయోగించి బ్యాటింగ్‌ సాధన చేశాడు’ అని ఝార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫీస్‌ బేరర్‌ ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు.