నా ప్రేమ కొంచెం వైల్డ్‌గా ఉండేది: షోయబ్ అక్తర్

వాస్తవం ప్రతినిధి: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే షోయబ్ అక్తర్.. తాజాగా భారత ఆటగాళ్లతో సరదాగా గడిపిన క్షణాలను నెమరువేసుకున్నాడు. సహచర ఆటగాళ్ల పట్ల తన ప్రేమ కొంచెం క్రూరంగా ఉండేదన్నాడు.

ఎప్పుడూ వారితో సరదాగా వాదులాడుకునేవాడినని, ఈ క్రమంలో కొన్నిసార్లు హద్దులు దాటి వారిని గాయపర్చిన సందర్భాలున్నాయని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఓసారి ఇలానే భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వెన్ను విరిచానని, అలాగే అఫ్రిది పక్కటెముకలకు గాయం చేసానని గుర్తు చేసుకున్నాడు.

‘నేను చనువుగా ఉండే ఆటగాళ్లతో సరదాగా వాదులాడేవాడిని. నెడుతూ.. కొడుతూ మాట్లాడేవాడిని. నా పద్ధతిలో ప్రేమ చూపించడం అంటే అదే. ఇలా కొన్నిసార్లు హద్దులు దాటి ఆటగాళ్లను గాయపర్చిన సందర్భాలున్నాయి. ఇలానే ప్రవర్తించి యువరాజ్ వెన్ను విరిచా. అంతకు ముందు అఫ్రిదిని హత్తుకొని పక్కటెముకలు విరగ్గొట్టా. అబ్ధుల్ రజాక్‌ను బాగా స్ట్రెచ్ చేసి అతని కాలి నరం మెలిక పడేలా చేశాను. అయితే ఇదంతా ప్రేమతో సరదాగా చేసింది. నా ప్రేమ కొంచెం వైల్డ్‌గా ఉంటుంది.’ అంటూ అక్తర్ చెప్పుకొచ్చాడు