సాధన మొదలుపెట్టిన సింధు.. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు..!!

వాస్తవం ప్రతినిధి: బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సుదీర్ఘ విరామం తర్వాత సాధన మొదలుపెట్టింది. అన్‌లాక్‌డౌన్‌-3లో భాగంగా బుధవారం నుంచి జిమ్‌లకు అనుమతి లభించడంతో హైదరాబాద్‌లోని సుచిత్ర అకాడమీలో సింధు కసరత్తులు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం సుచిత్ర అకాడమీలో సింధు తన వ్యక్తిగత ఫిట్‌నెస్‌ కోచ్‌ శ్రీకాంత్‌ వర్మ ఆధ్వర్యంలో దాదాపు 3 గంటల పాటు వ్యాయామం చేసింది. కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన సింధు.. ఇక ఫిట్‌నెస్‌ మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ” కొవిడ్‌-19 వ్యాప్తితో ఇన్నాళ్లు ఫిట్‌నెస్‌ ప్రాక్టీస్‌కు దూరమైన క్రీడాకారులకు ఇది చాలా ఉపయోగకరం. తెలంగాణ ప్రభుత్వం పరిమితులతో కూడిన అనుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ప్లేయర్లంతా భౌతిక దూరం పాటిస్తూ ప్రాక్టీస్‌ చేసుకోవాలి” అని చెప్పింది. ఈ సందర్భంగా వర్కవుట్‌ చేస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.