కేసీఆర్ మౌనం కుట్రలో భాగమే:ఉత్తమ్ కుమార్ రెడ్డి

వాస్తవం ప్రతినిధి: కృష్ష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా దోచుకుపోతున్నా జగన్‌ను కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచి, సంగమేశ్వర్ దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తే కృష్ణా నది నుంచి ఆంధ్రప్రదేశ్ అదనంగా 6 టీఎంసీ నీళ్లను దోచుకుపోతుందని అది తెలంగాణకు భారీ నష్టమని ఉత్తమ్ అన్నారు.

ఇంత పెద్ద ఎత్తున ఏపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని దీని వెనక అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. కేసీఆర్ ఉద్దేశ పూర్వకంగానే మౌనంగా ఉంటున్నారని, ఇందులో పెద్ద కుట్ర దాగి వుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండు టీఎంసీ నీళ్ల కోసం రూ.1 లక్ష కోట్లు కేసీఆర్ ఖర్చు చేశారు.

తరతరాల తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ కృష్ణా నదిపై ప్రాజెక్టులను ఎందుకు నిర్మించడం లేదని ఆయన ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడును కేసీఆర్ అడ్డుకోకుండా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? జగన్ కి ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆర్థిక సహాయం చేసారనే ప్రచారం జరుగుతుంది.కేసీఆర్, జగన్ లు కలిసినప్పుడు నీటి సమస్యల పై తెలంగాణ రాష్ట్రానికి అన్యాయంపై కేసీఆర్ మాట్లాడక పోవడం కుట్రలో భాగమేనని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డ్ కు ఫిర్యాదు చేశామన్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ కు లేఖ రాసి ఫిర్యాదు చేశామన్నారు. ఆయినా కూడా కేసీఆర్ నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు.