వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను : చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: అందాల విశాఖపట్నం నగరాన్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డులో ప్రమాదం జరిగింది. షిప్ యార్డులో క్రేన్ విరిగిపడడంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటా హుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. క్రేన్ శిథిలాలను పక్కకు తొలగిస్తున్నారు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 10 మంది ఉన్నారని సమాచారం. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది వరకు ఉన్నారని అంటున్నారు. వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

మరోవైపు దీని పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క‌ చ‌ర్య‌లు చేప‌ట్టి క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు. అలాగే మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేశారు. మృతుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.