టిక్ టాక్ బ్యాన్ ఆలోచనలో ట్రంప్

వాస్తవం ప్రతినిధి: భారత్‌లో నిషేధంతో ఇప్పటికే కష్టాలు పడుతున్న వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌కు అమెరికాలోనూ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. టిక్‌టాక్‌ను నిషేధించే విషయాన్ని తమ పరిపాలన విభాగం పరిశీలిస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. అత్యవసర కార్యనిర్వాహక ఉత్తర్వులను ఉపయోగించి టిక్ టాక్ ను బ్యాన్ చేయడం కోసం వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. చైనా ఇంటెలిజెన్స్‌ ఈ యాప్ ద్వారా దేశ రహస్యాలను మరియు అమెరికా అధికారుల వ్యక్తిగతసమాచారాన్ని కొల్లగొడుతుందని ఆయన ఆరోపించారు. అమెరికాలో కూడా బాగా పాపులర్ అవుతున్న సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను త్వరలోనే నిషేధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తెలిపారు. అమెరికా పౌరుల సమాచార గోప్యతపై ఆందోళన వ్యక్తమవుతుండడంతో టిక్‌టాక్‌ను నిషేధించే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో గత నెలలో పేర్కొన్నారు.