గంటలో సెంచరీ చేస్తానన్నాడు..చేశాడు!

వాస్తవం ప్రతినిధి: ఒక రంజీ మ్యాచ్‌కు ముందే మరో గంటలో సెంచరీ చేస్తానని టీమిండియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ తనతో చెప్పినట్లు మాజీ పేసర్‌ లక్ష్మీపతి బాలాజీ గుర్తుచేసుకున్నాడు. మరొక మ్యాచ్‌లో బద్రీనాథ్ అంబులెన్స్‌లో వచ్చి మరీ శతకం బాది జట్టును ఆదుకున్నాడని తెలిపాడు. రంజీ క్రికెట్‌ ఆడే రోజుల నుంచే తనకు బద్రీ తెలుసని బాలాజీ చెప్పాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ నిర్వహించే ‘ఫార్ములా ఫర్‌ సక్సెస్‌’ అనే యూట్యూబ్‌ షోలో లక్ష్మీపతి బాలాజీ మాట్లాడుతూ సుబ్రమణ్యం బద్రీనాథ్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఇదే షోలో బద్రీ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అశ్విన్‌.. బద్రీతో పాటు బాలాజీని పలు విషయాలను అడిగాడు. ఈ క్రమమంలో బద్రీనాథ్‌ బ్యాటింగ్‌ గురించి అడగ్గా.. బాలాజీ స్పందించాడు. ‘గంటలో సెంచరీ చేయబోతున్నాను అని చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా?. నేను 2005లో చూశాను. ఒక దశలో ఉత్తమ స్పిన్నర్లు బౌలింగ్ చేసినా.. బద్రీనాథ్ వారిపై ఆధిపత్యం చెలాయించాడు. రంజీ ట్రోఫీలో తన తొలి మ్యాచ్‌లోనే ఒక సెషన్‌లో శతకం ఎలా బాదగలడో చూపించాడు’ అని బాలాజీ చెప్పాడు.