‘ ఉగ్రరూపం ‘ లో మహేశ్ ఫాన్స్ – శాంతింపచేసే బాధ్యత ఎవరిది ?

వాస్తవం ప్రతినిధి: ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. టాలెంటెడ్ నటుడు సత్యదేవ నటించిన ఈ సినిమాని వెంకటేష్ మహా అద్భుతంగా చిత్రీకరించాడు. సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ అదరగొట్టే రీతిలో ఉండటంతో ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమా పరంగా అంతా బాగానే ఉన్నా ఈ సినిమాలో ఓ సన్నివేశం మహేష్ ఫ్యాన్స్ కి ఉగ్రరూపాన్ని తీసుకు వచ్చినట్లయింది. పూర్తి విషయంలోకి వెళితే సినిమాలో సత్యదేవ్ స్నేహితుడిగా నటించిన సుహాస్ భీభత్సమైన ఎన్టీఆర్ ఫ్యాన్ గా నటించాడు. అంత వరకూ బాగానే ఉంది. అయితే ఒక సన్నివేశంలో మహేష్ బాబు ఫ్యాన్ అయిన ఒక అమ్మాయితో సుహాస్ మాట్లాడుతూ మహేష్ ఉన్న చోట నుండే విలన్స్ ను కొడతాడు అదే మా ఎన్టీఆర్ అయితే అటూ ఇటూ తిరుగుతూ నరికేస్తాడు అన్న తరహాలో ఒక డైలాగ్ ఉంది. దానికి ఆ అమ్మాయి క్లాస్ హీరో అని సమాధానమిస్తుంది. అయితే సినిమాలో మహేష్ పై ఎటకారంగా డైలాగ్ ఉండటంతో …ఆయన ఫ్యాన్స్ ఉమా మహేశ్వర టీమ్ పై ఉగ్ర రూపం దాలుస్తున్నారు. సినిమా యూనిట్ మొత్తం పై సెటైర్లు మీద సెటైర్లు వేస్తున్నారు.