కరోనాతో ఏపీ మాజీ మంత్రి మృతి..!!

వాస్తవం ప్రతినిధి: కరోనాతో ఏపీ బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కన్నుమూశారు. మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్‌ ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించిండంతో కొద్ది రోజులుగా వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి చేజారడంతో శనివారం ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న మృతికి సంబంధించి అధికారికంగా ప్ర‌క‌ట‌న చేశారు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు. పశ్చిగోదావరి జిల్లాకు చెందిన మాణిక్యాలరావు 2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు ఆయన మంత్రిగా కొనసాగారు. మాజీ మంత్రి మాణిక్యాల రావు మరణవార్తతో బీజేపీ శ్రేణులు, ఆయన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కోవిడ్ నిబంధనల ప్రకారం మాణిక్యాల రావు అంత్యక్రియలు నిర్వహిస్తారు.