వివాదం లో అయోధ్య భూమి పూజ వ్యవహారం ?

వాస్తవం ప్రతినిధి: త్వరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ అంగరంగ వైభవంగా చేయటానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది సాధువులను వారితో పాటు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పోరాడిన కీలక వ్యక్తులను ట్రస్టు ఆహ్వానించింది. అంతేకాకుండా కోర్టులో రామజన్మభూమి కేసు విషయంలో వాదించిన న్యాయవాదులను కూడా ఆలయ భూమి పూజ కార్యక్రమానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపడం జరిగింది. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ఈ భూమి పూజ వ్యవహారం ఇప్పుడు వివాదంలోకి వెళ్లినట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత్రి మాయావతి షాకింగ్ కామెంట్ చేశారు. ఆమె ఏమంది అంటే అయోధ్య రామాలయం భూమి పూజకు దళిత ఆధ్యాత్మిక నేతలను మరియు ప్రతినిధులను పిలవాలని డిమాండ్ చేసింది. మొదటి నుండి హిందూమతం లో దళితులకు ఎక్కువ ప్రాధాన్యం దక్కడం లేదని దేశంలో ఎప్పటినుండో వినిపిస్తున్న వాదన. ఇటువంటి తరుణంలో మాయావతి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి. చాలా మంది దళిత మేధావులు మళ్లీ పూర్వపు రోజులు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని… రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా ప్రజాస్వామ్యం మారుతున్నట్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.