ఇది దుర్మార్గం..అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోండి: చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని వికేంద్రీకరణబిల్లుతో పాటుగా సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు.దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏపీ ప్రభుత్వం పై ఒక రేంజి లో మండిపడ్డారు.

తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని కొనసాగించాల్సింది పోయి… వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన పనులు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు అసహ్యించుకునే చర్యలకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని… మనం చేసే మంచి పనులే శాశ్వతమని చెప్పారు. హైదరాబాదులో ఐటీని, ఎయిర్ పోర్టును, ఔటర్ రింగ్ రోడ్డుని, సైబరాబాదుని డెవలప్ చేశామని… అవి తనకు ఎంతో తృప్తినిస్తాయని అన్నారు.ప్రపంచ చరిత్రలో ఎక్కడా మూడు రాజధానులు లేవని అన్నారు. రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని… ఈ విషయంపై ప్రజలంతా ఆలోచించాలని అన్నారు.

అమరావతి కోసం డబ్బులు పెట్టి భూములు కొనలేదని… ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించామని చెప్పారు. మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అమరావతి పూర్తయ్యేదని అన్నారు. అమరావతి నిర్మాణానికి రూ. లక్ష కోట్లు ఖర్చవుతుందని, వరదలు, భూకంపం ముప్పు ఉందని, ఇలా రకరకాల అపవాదులు వేసి పక్కదారి పట్టించారని మండిపడ్డారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు.

శాసనమండలి స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ అని… మూడు రాజధానుల బిల్లును మండలి ఆమోదించలేదని చంద్రబాబు చెప్పారు. బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉందని హైకోర్టుకు కూడా చెప్పారని… కానీ, ఇలా ఆమోదించుకోవడం దుర్మార్గమని విమర్శించారు.