జగన్ ఇచ్చే ఫైల్ దేనికైనా సరే బీజేపీ ఆమోదమే : శైలజానాథ్

వాస్తవం ప్రతినిధి: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఓకే చెప్పారు. తాజాగా ఈ రెండు బిల్లులకు రాజ్ భవన్ నుంచి ఆమోదం లభించింది. మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంపై రాజకీయ దుమారం రేగుతోంది.

గవర్నర్ నుంచి మూడు రాజధానులకు ఆమోదం తెలపడంతో మరోసారి ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. దీనితో ప్రతిపక్ష పార్టీలు మూడు రాజధానులు వద్దని మరోసారి వైసీపీ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక్క హైకోర్టుతోనే కర్నూలు న్యాయ రాజధాని ఎలా అవుతుందని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయ రాజధానిని ఏర్పాటు చేయడం పేరుతో ముఖ్యమంత్రి సీమ ప్రజల్ని మోసం చేస్తున్నారని, కర్నూలుకు రాజధానిని దూరం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. జగన్ కి బీజేపీ కి మంచి సంబంధాలు ఉన్నాయని ఒకరిని ఒకరు కాపాడుకుంటారని, జగనే ఒకప్పుడు అన్నాడు తాను ఎప్పుడు బీజేపీ కి వ్యతిరేఖం కాను అని అలా ఈ మూడు రాజధానులు అంశం విషయంలో బీజేపీ జగన్ కే మద్దతు ఇస్తుంది అని వ్యాఖ్యానించారు. జగన్ ఇచ్చే ఫైల్ దేనికైనా సరే బీజేపీ ఆమోదం తెలుపుతుంది అని జగన్ బీజేపీ ఒక్కటే అని సంచలన కామెంట్స్ చేశారు.