ముందు ప్రజల ప్రాణాలు కాపాడండి..మూడు రాజధానులు కాదు: జనసేనాని

వాస్తవం ప్రతినిధి: సీఆర్డీయే రద్దు బిల్లు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రపజలు కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనలతో ఉన్న ఈ సమయంలో.. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటుపై కాకుండా, కరోనా నుంచి ప్రజలను రక్షించడం ఎలాగన్నదానిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పవన్ హితవు పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన జనసేనాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“గుజరాత్ రాజధాని గాంధీనగర్ ను, చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ ను మూడున్నర వేల ఎకరాల్లోనే నిర్మించారు. ఏపీలో అమరావతిని కూడా అదే రీతిలో కట్టాలని నిపుణులు చెప్పినా, టీడీపీ ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా 33 వేల ఎకరాలు సమీకరించింది. ఆ నిర్ణయాన్ని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా సమర్థించారు. అమరావతిలో అద్భుత రాజధాని నిర్మించాలంటే 33 వేల ఎకరాలు కావాల్సిందేనన్నారు.

అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది జనసేన ఒక్కటే. ఆ భారీ రాజధానిని భవిష్యత్ ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లకపోతే భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటని నాడు ప్రశ్నించింది జనసేన మాత్రమే. ఇప్పుడు రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో రైతుల పక్షాన పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉంది. నాడు టీడీపీ ప్రభుత్వం రాజధానిని మూడున్నర వేల ఎకరాలకు పరిమితం చేసి ఉంటే రైతుకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు” అని పవన్ స్పష్టం చేశారు.