శ్రావణ మాస విశిష్టత!

ఓం శ్రీమాత్రేనమః ..
శ్రావణమాసంలో ప్రతి ఇల్లూ లక్ష్మీనివాసమే. పెళ్ళిప్రయత్నాలు, సేద్యపు పనులు …మంచి పనులు ప్రారంభించటానికి ఇదే మంచిమాసమంటారు వేదపండితులు. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున శ్రవణా నక్షత్రంలో ఉంటాడు. అందుకే శ్రావణమాసమని పేరు. మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. దశావతారాల్లో కృష్ణావతారం ఈ మాసంలోనే మెదయ్యింది. శ్రీకృష్ణుడు శ్రావణబహుళ అష్టమినాడు దేవకీ వసుదేవు అష్టమగర్భంలో జన్మిస్తాడు. శ్రావణపౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి.

శ్రావణ శుక్రవారాలు : శ్రావణం దేవుడికి, భక్తుడికి అనుసంధానం కావించే మాసం.ఉపవాసం అంటే పరమాత్మకు దగ్గరగా వెళ్ళటం. లక్ష్మీదేవి కటాక్షంకోసం శ్రావణపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేస్తారు. అలా కుదరకపోతే ఎదో ఒక శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేస్తారు.
పోలాల అమావాస్య : శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ రోజు పాడిపశువులను శుభ్రంగా కడిగి కుంకుమదిద్ది హారతులిస్తారు. మనిషికి-పశువుకు మధ్యవుండే అనుబంధాన్ని చాటే పండుగ పోలాల అమావాస్య.

భానుసప్తమి : సమస్త ప్రపంచానికి వెలుగులు పంచే ప్రత్యక్ష భగవానుడైన సూర్యునికి నమస్కారాలు సమర్పిస్తూ భానుసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు.

శ్రావణ మంగళవారాలో గౌరిదేవి వ్రతమాచరిస్తారు. శ్రావణమాసం సోమవారాలలో శివుణ్ణి ఆరాధిస్తారు.
శ్రావణపౌర్ణమి : ఇస్తినమ్మ వాయనం…పుచ్చుకొంటినమ్మ వాయనం… శ్రావణమాసపు వాయన దానాల్లో ముత్తైదువలు చెప్పుకునే మాట నిజానికి ఇది వాయనం కాదని వాహనం అని అంటారు. అంతిమ ఘడిల్లో వైకుంఠం నుంచి దేవదూతలుల తీసుకొచ్చే దివ్యవాహనం. కడదాకా నీ దాతృత్వమే నిన్ను కాపాడుతుంది అన్న సత్యాన్ని మన పెద్దలు ఇలా చెప్పించారన్నమాట.

శ్రావణపౌర్ణమి రోజే రక్షాబంధనం లేక రాఖీపౌర్ణమి. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధనం యెక్క ప్రాధాన్యతను వివరిస్తాడు. సోదరీమణులు సోదరులకు రాఖీకట్టి రక్షకోరతారు. ఈ వేడుక గురించి పురాణాల్లో కూడా చెప్పబడింది.

శ్రావణమాసం ప్రత్యేకతలు, ఆచరించాల్సిన నియమాలు : –

ఏడు రోజుల్లో…
సోమవారం : – విశిష్టమైనదిగా చెబుతుంటారు. ముక్కంటికి సోమవారం ప్రీతీకరమైనది. ఈ రోజున స్వామిని పూజిస్తే..సమస్త శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. లింగస్వరూపుడికి అభిషేకాలు, అర్చనలు చేయాలని, దీనివల్ల శుభాలు కలుగుతాయని పండితులు వెల్లడిస్తున్నారు.

మంగళవారం : – శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఎంతో ప్రీతీకరమైన రోజు. దేవతలందరినీ భక్తి శ్రద్ధలతో పూజిస్తే శుభాలు కలుగుతాయని నమ్మకం. గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించాలంటారు. అవివాహితులు కూడా వ్రతాన్ని చేస్తారు.

బుధవారం, గురువారం : ఈ రెండు వారాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. బుధవారం అయ్యప్పకు, గురువారం రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, దక్షిణమూర్తికి ప్రీతికరమైన రోజులు.

శుక్రవారం : ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైంది. వరలక్ష్మీ వ్రతాన్ని కొంతమంది ఆచరిస్తుంటారు. మహాలక్ష్మి విగ్రహానికి అలంకరణ చేసి ఇరుగు, పొరుగు, బంధువులను పిలిచి వ్రతాన్ని నిర్వహిస్తారు. వచ్చిన వారికి తాంబూళం, శనగల ప్రసాదం ఇస్తారు.

ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా భావించి గౌరవిస్తారు. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు గారెలు, పూర్ణాలు, తోచిన విధంగా వాయినాలు ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ వ్రతాన్ని చేసే వారికి అన్ని శుభ శకునాలే కలుగుతాయని నమ్మకం. ఆలయాల్లో, ఇంట్లో కుంకుమార్చనలు చేస్తుంటారు. నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తుంటారు.

శనివారం : శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున కొంతమంది ఉపవాస దీక్షలు చేస్తుంటారు. స్వామి వారికి పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రతి శనివారం స్వామి వారిని కొలిస్తే..శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం.

శ్రావణ మాసంలో మొదటి పండుగ మంగళగౌరి వ్రతంగా చెప్పవచ్చు. ఆ తర్వాత నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పూర్ణిమ, గురు రాఘవేంద్ర స్వామి ఆరాధానోత్సవాలు, శ్రీకృష్ణాష్టమి పండుగలు వస్తాయి.

వరలక్ష్మీ వ్రతం
ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఐదోవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని శాస్త్రం చెప్తోంది. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం.

ఇట్లు,
కరోతు సురేష్