ఆ దేశ మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష!

వాస్తవం ప్రతినిధి: మలేషియా మాజీ ప్రధాని నజీబ్‌ రజాక్‌కు ఆ దేశ కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అధికారంలో ఉండి భారీఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన కేసుల్లో తీర్పు వెలడించింది. అంతేకాకుండా.. అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు గాను 210 మిలియన్ రింగిట్స్ (49 మిలియన్ డాలర్ల) జరిమానా కూడా విధించారు. అధికార దుర్వినియోగానికి 12 ఏళ్లు, మూడు నేరపూరిత కార్యకలాపాలకు 10 ఏళ్ల చొప్పున, మూడు మనీ లాండరింగ్‌ నేరాలకు 10 ఏళ్ల చొప్పున శిక్ష విధించారు. కాగా.. అన్నింటికి కలిపి ఆయన 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తే సరిపోతుందని కోర్టు తెలిపింది. నజీబ్‌ రజాక్ 2009 నుంచి 2018 వ‌ర‌కు మ‌లేషియా ప్ర‌ధానిగా చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయన అవినీతి బయటపడటంతో అధికారాన్ని కోల్పోయారు. మలేసియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా కోర్టు నిర్ధారించడం ఇదే మొదటిసారి. కాగా.. నజీబ్ మాత్రం నేరాన్ని అంగీకరించలేదు. ఈ కేసు గురించి ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తానని ఆయన తెలిపారు.