నార్త్ కొరియాలో తొలి కరోనా కేసు నమోదు..సరిహద్దులు మూసివేత!

వాస్తవం ప్రతినిధి: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ ఆ ఒక్క దేశంలో మాత్రం కనీసం అడుగుపెట్టలేకపోయింది. ఇదంతా శనివారం వరకు ఉన్న సంగతి. తాజాగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి. ఉత్తర కొరియాలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. జ్వరం, దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటోన్న అతను ఆసుపత్రిలో చేరాడు. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ దేశం అధికారికంగా ప్రకటించిన తొలి కేసు ఇదేకావడం గమనార్హం. దీంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జొంగ్ ఉన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశ సరిహద్దులను మూసివేయమని ఆదేశించారు. అలాగే కేసాంగ్ నగరంలో లాక్‌డౌన్ విధించారు.

వైరస్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వారితో మెలిగిన వారందరినీ కఠినమైన క్యారెంటైన్‌ నిబంధనలు వర్తించే విధంగా నిర్బంధించాలని పేర్కొన్నారు. తొలి కేసు నమోదైన దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కొరియాకు ప్రమాదం పొంచిఉందని కిమ్‌ ఆదేశించారు. క్రమంగా ప్రవేశించడానికి కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని కిమ్‌జొంగ్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్ వ్యాప్తి చెందకూడదని కఠిన ఆదేశాలను జారి చేశారు.