క్రికెటర్లకి ప్రతిరోజూ కరోనా వైరస్ పరీక్షలు?

వాస్తవం ప్రతినిధి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ సమయంలో క్రికెటర్లకి ప్రతిరోజూ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) సహ యజమాని నెస్‌ వాడియా డిమాండ్ చేశారు. యూఏఈలో ఐపీఎల్‌ సజావుగా జరిపేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధంగా ఉండాలన్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలో లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో నెస్‌ వాడియా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఐపీఎల్‌ జరిగే సమయంలో మైదానంలోనూ, మైదానం బయట కూడా కచ్చితమైన ఆరోగ్య పరిరక్షణ నిబంధనలు పాటించాలి. ఇందులో ఏమాత్రం రాజీ పడరాదు. సాధ్యమైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు జరపాలి. సరిగ్గా చెప్పాలంటే ప్రతి రోజూ నిర్వహిస్తే మంచిది. నేనే ఆటగాడినైతే ఎలాంటి అభ్యంతరం చెప్పను. లీగ్‌లో ఎనిమిది జట్లు ఉంటాయి కాబట్టి ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్‌ తరహాలోనైతే బయో సెక్యూర్‌ వాతావరణం సాధ్యం కాదు’ అని నెస్‌ వాడియా అన్నారు. కరోనా పరీక్షల విషయంలో యూఏఈ కూడా చాలా బాగా పని చేస్తోంది కాబట్టి బీసీసీఐ అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తే చాలన్నారు.