ఐపీఎల్ 2020 నిర్వహణపై స‌ల్మాన్ క్లారిటీ

వాస్తవం ప్రతినిధి: భార‌త్‌లో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) నిరవధిక వాయిదా ప‌డింది. భారత్‌లో క్రికెట్‌ను పున:ప్రారంభించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంత ప్రయత్నిస్తున్నా అది సాధ్యం కావట్లేదు. దేశంలో కరోనా వైరస్ ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఐపీఎల్‌ను విదేశాలకు తరలించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఆ టోర్నీని దుబాయ్‌లో నిర్వ‌హిస్తార‌న్న ఊహాగానాలు ఇటీవల ఎక్కువయ్యాయి.

ఈ నేప‌థ్యంలో దుబాయ్ స్పోర్ట్స్ సిటీ హెడ్ స‌ల్మాన్ హ‌నిఫ్ ఈ ఐపీఎల్‌పై ఓ క్లారిటీ ఇచ్చారు. తాజాగా స‌ల్మాన్ హ‌నిఫ్ గల్ఫ్ న్యూస్‌తో మాట్లాడుతూ… ‘ఒక‌వేళ ఐపీఎల్ 2020ని దుబాయ్‌లో నిర్వ‌హించాల‌నుకుంటే.. మేము సిద్ధంగా ఉన్నాం. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో అన్ని స‌దుపాయాలు రెడీగా ఉన్నాయి. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం, ఐసీసీ అకాడ‌మీ.. స్పోర్ట్స్ సిటీలోనే ఉన్నాయి. స్టేడియంలో తొమ్మిది పిచ్‌లు ఉన్నాయి. ఒక‌వేళ త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మ్యాచ్‌లు నిర్వ‌హించినా ఎటువంటి న‌ష్టం ఉండ‌దు. పిచ్ కోసం మ్యాచ్‌ల‌ను షెడ్యూల్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది’ అని అన్నారు. ఐసీసీ కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ కోసం 38 నెట్ వికెట్లు ఉన్న‌ట్లు హ‌నిఫ్ తెలిపారు.