కరోనా వైరస్ గురించి డ్రాగన్ దేశానికి ముందే తెలుసు: డాక్టర్‌ లి-మెంగ్‌యాన్

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ గురించి చైనాకు ముందే తెలుసని హాంగ్ కాంగ్ పరిశోధకురాలు లి-మెంగ్ యాన్ ఆరోపించారు. ఈ విషయాన్ని దాచిపెట్టకుండా చైనా వెల్లడించి ఉంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలతో బయటపడేవారని ఆమె అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం డిసెంబరులో మహమ్మారి విస్తరణ గురించి మాట్లాడకుండా తన నోరు మూయించారని ఆమె ఆరోపించారు. ప్రాణభయంతో హాంగ్ కాంగ్ నుంచి అమెరికాకు పారిపోయిన లి-మెంగ్ యాన్ కొన్ని నెలలుగా రహస్య ప్రాంతంలో ఉంటున్నారు. శుక్రవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇమ్యునాలజీ నిపుణురాలు యాన్ ఈ విషయాలను వెల్లడించారు.

చైనాలోని తమ సహచరులతో ఈ వైరస్ గురించి చర్చించుకున్నామని, అయితే కొన్ని రోజుల్లోనే వారి గొంతులు మోగబోయినట్లు యాన్ చెప్పారు. వైరస్‌ వ్యాప్తికి మూలమైన వూహాన్ నగరంలోని డాక్టర్లు, పరిశోధకులు ఒక్కసారిగా మాట్లాడం ఆపేశారని, వైరస్ గురించి అడగవద్దంటూ తనని హెచ్చరించారని ఆమె వివరించారు. ఏప్రిల్ 28న యూనివర్సిటీ క్యాంపస్‌లోని నిఘా కెమెరాల నుంచి తప్పించుకుని విమానంలో అమెరికాకు చేరినట్లు లి-మెంగ్ యాన్‌ వివరించారు. తాను ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే కొందరు పరిశోధకుల మాదిరిగా జైల్లో ఉండటంతో లేక కనిపించకుండా పోవడంతో జరిగి ఉండేదన్నారు. కేవలం పాస్ పోర్టు, డబ్బుల పర్సుతో హాంగ్ కాంగ్‌ను వీడి వచ్చానని, తన వారంతా అక్కడే ఉన్నట్లు ఆమె చెప్పారు. వైరస్ గురించి వాస్తవాలు చెప్పడానికే తాను అమెరికా వచ్చినట్లు లి-మెంగ్ యాన్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు ఉన్నదని, ఇక ఎప్పటికీ తన దేశానికి వెళ్లలేనని ఆమె ఆవేదన చెందారు.